Latest Blog

No Cinema Weekend – Camp Sasi

‘NO CINEMA’ వీకెండ్

Indie Birds

Indie Films

28 ఏళ్ళ కళ్యాణ్ టైం చూసాడు, 9:38, ఇంకో గంటన్నర ఉంది వైన్ షాప్ మూయటానికి. ముగ్గురు రూమ్మేట్స్ లాంగ్వీకెండ్ అని ఊర్లకి వెళ్లిపోయారు. లేకపోతే శుక్రవారం ఈపాటికి రూంలో కోడికూర వండుతూ మందు పార్టీ మొదలైపోయేది. ప్రతివారం పార్టీనే. మందు తెచ్చుకోవడానికి బయలుదేరాడు, నిజాంపేట్ విలేజ్ ప్రశాంతంగా ఉంది. ఏ లాంగ్వీకెండ్ కి కళ్యాణ్ సొంతూరు విజయవాడ వెళ్ళడు, ఖాళీ హైదరాబాద్ రోడ్ల మీద బుల్లెట్ వేసుకుని తిరగడం అంటే ఇష్టం. పదేళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాడు, యానిమేటర్, ఆల్మోస్ట్ పదేళ్లుగా సేమ్ రూమ్మేట్స్. వైన్ షాప్ దగ్గర జనం బానే ఉన్నారు, రెండు రాత్రులుగా షాపులు క్లోజ్ ఉండటంతో నిన్నా మొన్న మందు దొరకని వాళ్ళే ఎక్కువున్నారు. చాలా మంది మొహాల్లో ఎప్పుడు తాగేద్దామా అనే ఆత్రం. హాఫ్ ఓల్డ్ మాంక్, ఒక ట్యూబోర్గ్ చిల్ బీర్ తీసుకుని, దారిలో సిగరెట్స్, థమ్సప్, చికెన్ పకోడీ, కర్రీ పాయింట్ లో కర్రీ సాంబారు, పెరుగు కొనుక్కుని రూం కి వచ్చాడు.

ముప్పై డిగ్రీలు టెంపరేచర్ దాటితే సమ్మర్ మొదలైపోయినట్టే కళ్యాణ్ కి. నైట్ షిఫ్ట్ లేనపుడు వీక్డేస్ లో రెండు బీర్లు, వీకెండ్లో బీరుతో మొదలుపెట్టి రమ్ముతో ముగిస్తాడు. ఓల్డ్ మాంక్ రీ ఎంట్రీ ఇస్తుందని కళ్యాణ్ ఊహించలేదు. దాంతోనే హాట్ మొదలుపెట్టాడు, థమ్సప్ తో తియ్యగా దిగిపోయేది. జీవిత బ్రాండ్ గా ఫిక్స్ అయిపోయాడు. అటువంటి మాంక్ మెరుపుతీగలా మార్కెట్ నుంచి మాయమయింది. అప్పట్నుంచి బ్రాందీ కి షిఫ్ట్ అయి బెంగళూరు వాళ్ళ మీద కుళ్ళుతో బతుకుతున్నాడు. మళ్లీ మాంక్ వెనక్కి రావడం కళ్యాణ్ ‘ఆనందాల్లో’ అతి ముఖ్యమైన ఆనందం.
బీర్, పకోడి పొట్లం ఓపెన్ చేసి ‘చిల్’ అవడం మొదలుపెట్టాడు. గత ఐదేళ్ళుగా ప్రతి శుక్రవారం మిస్ అవకుండా కళ్యాణ్ చేసే పని ఆ రోజు రిలీజ్ అయిన సినిమా రివ్యూలు చదవడం. జస్ట్ చదవడమే కాదు అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని శనివారం ఈవినింగ్ షో చూడాల్సిందే. ఎవరు వచ్చినా రాకపోయినా ఒక్కడే అయినా వెళ్లిపోతాడు. చిన్నప్పటినుంచి అంత పిచ్చి సినిమాలంటే. కనీసం ఐదారు సైట్లలో రివ్యూలు, పబ్లిక్ ఒపీనియన్ వీడియోలు, ట్వీట్లు, ఫేస్బుక్ రివ్యూలు, ఆ సినిమా డైరెక్టర్ల ఇంటర్వ్యూలు… తెచ్చుకున్న ఓల్డ్ మాంక్ అయిపోయేవరకు కావాల్సినంత కంటెంట్. ఈ వారం సినిమా ధియేటర్లు బంద్, అదేదో గొడవ, ఇది ఒకరోజు బంద్ కూడా కాదు, ‘నేటి నుంచి బంద్’. అంటే ఈ వీకెండ్ సినిమా లేనట్టే. సగం బీరు అయింది, కళ్యాణ్ యుట్యూబ్ స్క్రోల్ చేస్తున్నాడు. ‘కాలా’ట్రైలర్ ట్రెండ్ అవుతోంది, సాయంత్రం చూసాడు, పర్లేదు, కబాలి కి లుంగీ వెర్షన్ లా అనిపించింది.

సౌత్ ఇండియా మొత్తం బంద్, పెద్ద బందే అనుకున్నాడు. అసలు ఈ సినిమా బంద్ ఎందుకు జరుగుతోందో తెల్సుకోవాలనిపించి గూగుల్ చేసాడు, ఒక లింక్ క్లిక్ చేసి చదవటం మొదలుపెట్టాడు, బీరు చల్లగా దిగుతోంది. వీడియోస్ లోకి వెళ్లి నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతున్న వీడియో మొత్తం చూసాడు, కొంచెం అర్ధమైంది. బీర్ అయిపోయింది. కిచెన్లోకి వెళ్లి రమ్ పెగ్ ఫిక్స్ చేసుకుంటూ ఆలోచిస్తున్నాడు. డిజిటల్ అయే కొద్దీ టెక్నాలజీ చీప్ అవాలి, కానీ సినిమా థియేటర్లలో ఆడించడం ఇంకా కాస్ట్లీగానే ఉంది. నిర్మాతలు, థియేటర్లు ఓనర్ల బాధలో నిజముందనిపించింది కళ్యాణ్ కి. రమ్ సిప్ తగలగానే తెలియని ఆనందం, మళ్లీ థియేటర్ల గొడవలోకి దూరాడు కళ్యాణ్. ఇంగ్లీష్ హిందీ సినిమాలు మాత్రం ఆడుతున్నాయి, సౌత్ ఇండియన్ సినిమాలకి వసూలు చేసినట్లు ఆ సినిమాలకి ప్రింట్ ఫీజు వసూలు చేయడం లేదు, ఇది దారుణం అనిపించింది. ఇలాంటి లాంగ్వీకెండ్ లో సినిమాలు లేకపోతే జనాలు ఎలా ఎంటర్టైన్ అవుతారు? ఎక్కడికి వెళ్తారు? తనలాంటి బోరింగ్ బ్యాచిలర్స్ ఏం చేయాలి? సిటీలో పర్లేదు, ఊర్లలో టైంపాస్ ఎలా? ఖచ్చితంగా చాలా థియేటర్లు ఫుల్ అవుతాయి, కాస్త బాగున్నా చాలు తనలాంటోళ్ళకి, అసలు తనేం చేయాలి? చాలా ఆలోచిస్తున్నాడు… దీని గొడవలో పడి పకోడి సంగతి మర్చిపోయాడు. రెండు ముక్కలు రెండు సిప్పులు వేసి, ‘no.of telugu theatres’ అని గూగుల్ చేసాడు, చాలా రిజల్ట్స్ వచ్చాయి. కనీసం రెండువేల ఐదొందల థియేటర్లు, ఇవన్నీ బంద్ అయితే ప్రభుత్వానికి ఎంత నష్టం? నిర్మాతకి ఎంత నష్టం? ఎన్ని సినిమాలు పెండింగ్ పడిపోతాయి? పెగ్ అయిపోయింది, ఫస్ట్ రెండు పెగ్గులు ఎప్పుడూ ఫాస్టే, సినిమా బంద్ గొడవలో పడి మరీ ఫాస్ట్ గా తాగేసాడు. రెండో పెగ్ ఫిక్స్ చేసుకుని సిగరెట్ అంటించాడు. రెండువేల ఐదొందల థియేటర్లంటే రోజుకి పదివేల షోలు, షోకి యావరేజిగా మూడొందల టికెట్లు తెగినా ముప్పై లక్షల మంది వీకండ్లో సినిమాలు చూస్తారు, టికెట్ యావరేజి ఎంతుండొచ్చు అని ఆలోచిస్తున్నాడు కళ్యాణ్, యాభై అనుకున్నా పదహేను కోట్లు… ఇందులో మల్టీప్లెక్సులు ఉన్నాయా? అసలు తన లెక్క కరెక్టేనా? తనొక్కడు ఇంటి దగ్గర ఉన్న సింగిల్ స్క్రీన్ కి వెళ్తేనే 150-200 అయిపోతున్నాయి… రెండో పెగ్ సగం పైన అయింది… బాత్రూంకి వెళ్లి పోస్తూ ఆలోచిస్తున్నాడు, అసలు ఈ బంద్ ఎన్ని రోజులు జరగొచ్చు? వచ్చే వారం కూడా ఇలానే ఉంటుందా? జనాలు సినిమా లేకపోతే ఏమవుతారు? ఫ్లష్ చేసొచ్చి పెగ్ ఫినిష్ చేసి మూడోది పోసుకున్నాడు. అవును సినిమా అనేది లేకపోతే ఏమవుతుంది? ఏమీ అవకపోవచ్చు, జనాలు ఆన్లైన్ లో సినిమాలకి అలవాటుపడిపోవచ్చు, కానీ తనలాంటి థియేటర్ పిచ్చోళ్ళ పరిస్థితి ఏంటి? ఎన్నారై తెలుగోళ్ళు ఏమయిపోతారు? ఐదు రాష్ట్రాల్లో జనం సినిమా లేకుండా ఎలా టైంపాస్ చేస్తున్నారో? చికెన్ పకోడి చల్లబడిపోయింది. ఇంకో సిగరెట్ అంటించాడు… ప్రతోడూ మొబైల్లో సినిమాలు చూసేస్తున్నారు, అవి కూడా మోస్ట్లీ పైరేటెడ్, బిగ్ స్క్రీన్ మీద మజా తెలియని వెధవలు అనుకున్నాడు, కళ్యాణ్ పైరసీకి వ్యతిరేకం. యుట్యూబ్ లో ఏం చూడాలో అర్ధం కావడం లేదు, ఇంకా శ్రీదేవి వీడియోలే ట్రెండ్ అవుతున్నాయి. పెగ్ తీసుకుని బాల్కనీలోకి వచ్చాడు, ప్రశాంతంగా ఉంది, సిటీలోంచి ఎక్కువ మంది ఊర్లకి వెళ్ళినపుడు ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అక్కడే నిలబడి మూడో పెగ్ ఫినిష్ చేసాడు.


నాలుగో పెగ్ ఫిక్స్ చేసుకుని, కుక్కర్ లో రైస్ పెట్టేసాడు. రమ్ తాగుతూ ఫోన్ తీసి మళ్లీ యుట్యూబ్ ఓపెన్ చేసాడు, “వెల వెల పోయిన థియేటర్లు- విలవిలలాడిన ప్రేక్షకులు” అనే వీడియో కనిపిస్తే క్లిక్ చేసాడు, బంద్ వల్ల ఎంత ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతున్నారో మాట్లాడుతున్నారు జనాలు, ఒకడు మాత్రం కొంచెం డిఫరెంట్ గా మాట్లాడాడు, జనాలకి రొట్టకొట్టుడు తెలుగు సినిమా నుంచి హాలిడే దొరికిందని, బూజు పట్టిన బుర్రలు కాస్త ఫ్రెష్ అవుతాయని చెప్పుకుంటూ పోతున్నాడు… నిజమే అనిపించింది కళ్యాణ్ కి, ఒకోసారి తెలుగు సినిమా మీద విపరీతమైన కోపం వస్తుంది, తీసిందే తీసి తీసి తీసి తీసి…. కానీ ఏంచేయలేడు, అడిక్ట్ అయిపోయాడు. బానే ఎక్కేసింది, ఫేస్బుక్ ఓపెన్ చేసాడు, అందరూ ‘సినిమా బంద్’ గురించి ఏదో ఒకటి పోస్ట్ చేస్తున్నారు, కళ్యాణ్ ఎప్పుడూ ఏమీ పోస్ట్ చేయడు, జస్ట్ చూస్తాడు, చదువుతాడు. ఒక పోస్ట్ దగ్గర ఆగిపోయాడు, చదవటం మొదలుపెట్టాడు

 

#CinemaBandh, పరీక్షల నెల చూసుకుని జనాలు ఎలాగూ థియేటర్లకి రారు కాబట్టి, రిలీజ్ అయేవి కూడా చిన్న సినిమాలే కాబట్టి ఈ బంద్ ప్లాన్ చేసారు, పెద్ద హీరోల రిలీజ్ టైం లో ఇలాంటి బంద్ చేయగలరా… ఇదంతా కుట్ర, హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్లు తగ్గించమని బంద్ చేయాలి దమ్ముంటే……