Description
చిట్ట చివరి వాన – నీటికాకి మనస్సు చూపు
ఒక కాలంలో ఊర్లల్లో వర్ష పాతం ఎంత నమోదైయింది అని కొలవడానికి ఊరి వీధుల్లో వుండే రోకళ్ళలో నిల్చిన నీరుని బట్టి అంచనా వేసేవారు. చెరువుల్లో ఒక్కప్పడు ఎంత నీరు వుండేది అని అంచనా వేయడానికి చేరువుల్లో వుండే బండ రాళ్ళ మీద నీటి మరకల్ని బట్టి అంచనా వేసుకోవాలి. అటు వంటి బండల పైన వాలి వర్షపు నీటి జాడల్ని వెత్తుకుంటూవుంటాయి నీటి కాకులు. వాటి చూపుల్లోని ఆంతర్యం తెల్సుకోవాలంటే ఇదో ఈ చివరి వర్షం నీటి చుక్కల్లో కొద్దిగా తడవాలి…
వాన చినుకు
మట్టి వాసన
వూపిరి పోసుకున్న
నేను(కొన్ని వాన చినుకుల ముద్దు)
దానికి కొంత నీటి కాకి నిద్రలోని రోదన సవ్వడిని జోడించుకోవాలి. కానీ నగరవాసి వర్షానంతరం రోడ్డు మీద నీటి మడుగుల్లో కాలు పడకుండా జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్లి పోతారు. తొలకరి వర్షం రంగు మట్టిలో కలిసినప్పుడు ,మట్టి రంగు పులుమ్కుంటుందని తెలియక!. ఇక్కడ వర్షానికి రంగు ,రుచి, సువాసన వుండదు. కారణం వర్షం ఆగిపోవాలి అంతే. నగరం లో వర్షం ట్రాఫిక్ను ఆపే అరికట్టే రెడ్ లైట్ సిగ్నల్. వర్షం పడుతున్నంత సేపూ చికాకుగా నిల్చుంటాం , ఒకరితో ఒకరు మాట్లాడు కోకుండా ,ఎప్పుడెప్పుడు వెళ్లి పోదామా అన్న ఆత్రుతతో . కాని ఒక్కరు , ఆ ఒక్కురులాంటి కొందరు వర్షాన్ని చూస్తూ , వర్షం ఆగిపోయినా, అక్కడే ఇంకాసేపు నిలబడి వుంటారు, ఆకుల నుండి రాల్లుతున్న చుక్కలా, దారి నంటుకుపోయిన నీటి గుంటల్లా. అట్లాంటి వాడే ఎస్. వి.కే. విజయ్. ఇతను కవిత్వం రాయడం కంటే తనలో ఎక్కడో ఇమిడిపోయిన ప్రకృతిని వెలికితీసుకుంటున్నాడు. ఆ ప్రయత్నమే ఇదంతా . మనకు కనిపించని తడిని మనలోనే ఇంకిపోతున్న పచ్చటి చూపుతో వెతుక్కుంటూ సాగించే ప్రయాణం ఇతని కవిత్వం. మనసులోని కోరికల్ని చూపులకు దార పోసి , ఆలానే నిల్చున్న చోటి నుండే సాగించే ఈ నడక అతని ధ్యానం.
కనులు
జో కొట్టిన పాప
నిద్ర
*
శరీరం
అలసట నింపుకున్న
బానిస
*
నేల
నిద్రకి చోటిచ్చే
తల్లి (ఎరుక నుండి యింకో స్థితికి )
ఇతని కవిత్వం ఒక ఈవేంట్, మెటాఫర్ అండ్ మెమరీ. ఒక హైదరాబాదీ తన చుట్టూ లేని ప్రకృతిని మెటాఫర్కికల్గా ప్రకృతాక్షరంతో తనకి , ప్రకృతికి మధ్యనున్న ఏకాంత చేలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇతనికి రాయడం బాగా తెలుసు , రాసే క్రియలో ఒక ప్రత్యేక లక్షణం వుంది. ముంగింపు ని తిరిగి వెనక్కి లాగేస్తాడు. సహజంగా ఛాయాచిత్రకారుడు కదా! తనకంటూ ఉండే, ఇమిడిపోయిన చిత్రాల చుట్టూ దృశ్యాల్ని అల్లాడు. ఒక హైదరాబాదీ గా..
రాత్రి మెలుకువ
నగరం జాదూ-
నగరం
గూడు కట్టు
సాలె పురుగు-( హైదరాబాదీ). ఛాయాచిత్రకారుడు, కవి అవ్వడం వల్ల చూసే తీరు,రాసేతీరులో దృశ్యాన్నిచిత్రస్తాడు. ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రస్తావిస్తున్నప్పుడు మనం ఏ పాత్రలో వున్నామో గ్రహించాలి, ఇది చాలా కీలకం , ఎందుకంటే ఛాయాచిత్రం అన్నది ఒక వాస్తవాన్ని ప్రకటిస్తుంది, అక్షరచిత్రం ఒక నమ్మకాన్ని పరివ్యాప్తి చేస్తుంది. అందుకే కవిగా వున్నప్పుడు కవి పాత్రలోనే వుండాలి కానీ ఛాయచిత్రకారుడు కావద్దు. ఒక నమ్మకం అన్వేషణను కొనసాగిస్తుంది , ఒక వాస్తవం ఘటనను ప్తశ్నిస్తుంది. గుళ్ళకి వెళ్లి దేవుడు ఫోటో కొనో ,తీసో ,పక్క వాళ్ళకి ఇచ్చేస్తే ఇంక దేవుడు రూపం అదే అని ముద్ర పడిపోతుంది, కాని మనం చూసిన దేవుడు వేరే వాళ్ళకి అలాగే కనిపించాలని రూల్ ఏమి లేదు. ప్రకృతి ఫోటో వేరు, ప్రకృతి అక్షర చిత్రం వేరు. ఈ మెళుకువ విజయ్ ఇంకా సాధన చేయాలి. ఇక్కడ ఎందుకు తప్పటడుగులు పడతాయంటే మనం చూడని, అనుభవం లేని దాన్ని అనుభూతి లోకి తెచ్చుకుని సబ్కాన్షియస్ స్రేటాలో ప్రకటిస్తాం అప్పుడు కవిత దారి మళ్ళుతుంది. ఉదా: నీడ బొమ్మలు, కవితలో మొదలు చివర తనకు తెలియకుండా ప్రస్తావిన్చాడు . అడవి లోకం ఇంకా చీకటే ఒక్కప్పుడు మట్టి గోడలలో జీవం వుండేది, ఇప్పుడు ప్రభుత్వ పుణ్యామా అని చీకటి, గోడల్లో, అంతటా అలుముకుంది. అదే ఎలా అంటే చిన్న మార్పు , జంగిల్ రాత్రి,నేను ,నాన్న, వేటగాడి ఆకలిలా వెలుతురు
దాడి…
ఇక్కడ నాన్న, నేను అని వుంటే బాగుండేది. ఎందుకంటే వెనుక, ముందు ని పట్టుకోవాలి.అప్పుడు నీలా చాల మంది కనుపాపల్లో చీకటే ప్రయాణం కొనసాగిస్తోంది అన్న వాస్తవం ప్యారడైజ్ చౌరస్తా మాటగా చెపుతుంది. మొదటి దశలో ని అడుగులివి ,ఇవి తప్పటగులు కావు, పసిపాదాల నడక,ఆ దశలో నడక నేర్పించలేము, మోకరిల్లి నడకకి చేతులందిస్తూ..,
ఇతని కవితల్లో అబ్శ్రాక్ట్ రూపం వుంది, దానిని ఇంకా పాతుకుని అణుకువ అవసరం వుండి. అబ్శ్రాక్ట్ అంటే అవాస్తవమైన కవిత్వం కాదు, వాస్తవాన్ని వివిధ రూపాల్లో చెప్పడం. ఇది ప్రకృతితో అల్లుకున్న జీవితాల్ని తడిమితే గాని తెలియదు. విజయ్ లో పదబంధాల్ని కలిపే మెళుకువ చాల వుంది అవి అద్భుతమైన ప్రతీకలు , ఇది ఇకో పోయటిక్ లో ని మంచి లక్షణం .ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రూప నిర్మాణంలో పదాలనూ జాగ్రత్తగా వాక్యాలుగా అమర్చాలి ,ఇక్కడ విజయ ఇంకా తడబడుతున్నాడు, క్రమేణా సాధన ద్వారా వస్తుంది. ఇక్కడ చేయాల్సిన పని కవితని ఒకటి పది సార్లు చదువుకోవాలి , కనీసం ఒక వారం పాటు కవితను పక్కన పెట్టేసి తర్వాత చదువుకోవాలి అప్పుడే అక్షర బీజం నుండి మొలకెత్తిన రూపం అర్ధం అవుతుంది దాని రూప సారాంశం కనిపిస్తుంది . ఇది అతనికే కాదు అందరికి అవసరం. ఈ సంపుటి మొత్తంలో 130 కవితలున్నాయి. అవి కొన్ని జెనేర్ చుట్టూ అల్లుకున్నాయి వాన,నేను, అడవి,గాలి,చెట్టు. ఈ జెనేర్ని చెప్పే పదాలు ఎక్కువ శాతం చీకటి, వెల్తురు,నిశబ్ధం, నగరం,సాలెపురుగు,నగరం,వాన,ప్రయాణం,పక్షులు,ఆకులు,చివర్న,నిద్ర, కిటికి. ప్రతి కళాకరుడుకీ రెండు అంశాల పై పట్టు రావాలి ,ఒకటి స్కిల్,క్రాఫ్ట్ మెన్ షిప్. అతనికి స్కిల్ వుంది,రెండో దాని పై దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. మొదటి అంశం చాల కవితల్లో ప్రస్ఫుటం గా కనిపిస్తుంది…
గడ్డిలో
మొలిచిన
యెర్రపురుగు
సూర్యుడు-( తెలవార్లు )
పాదాల కంటికి
అంటు మట్టి
దేహం అంతా
అత్తరు-( వానాగిపోయాక దారి)
గాజుసీసా
నేనూ
పగలడం
వెతుక్కోవడంలా
మబ్బు తునకా
నువ్వూ
ఘనీభవించడం
తెలుస్కోవడంలా (మరికొన్ని ఊహలు, అంతే )
నేలంతా యిప్పుడు
జుట్టు చెదిరిన
ఆడపిల్ల (అడుగుల ముగ్గు )
యితని కవితలో అల్లుకున్న కవితలు ,జానపదాల్లోని పిట్ట కధల్లా వుంటాయి, అలానే ప్రతీకలు . ఈ గుణం చాలా బాగానూ, ఎక్కువగాను వుంది. అంతా బాగానే వుంది. ఇబ్బందులు కలిగించే విషయాల్ని గమనిస్తే తనకు పట్టున్న అంశం లో కవిత రూపం ,బావం స్పష్టంగా వ్యక్తమవుతోంది. మచ్చుకగా,అడుగుల మడుగు కవిత, అద్భుతమైన ముగింపు. అలా యిన్కొన్ని కవితలున్నాయి, తనకు పట్టు లేని అంశాల్లో రూపం ,భావం కొరవడుతోంది.ఇది కేవలం కవితల్లోనే కాదు ,పుస్తకంలో అమర్చిన కవితల అల్మారిలో కూడా . ) దాని వల్ల దారిమధ్యలో అరికాళ్ళ చూపుల్లో ముళ్ళల్లా గుచ్చు కుంటున్నాయి. ఇక్కడ ఒక నిశ్శబ్దం నిర్మానుశ్యాంగా మారుతోంది. కవితా సంపుటి గుచ్చాన్ని పేర్చుతునప్పుడుప్పుడు, తారీఖులనుసారం అమర్చాల్సిన అవసరం లేదు, మూడ్ ని కొంసాగించడం ముఖ్యం , అది గుచ్చపు సువాసనని ఆస్వాదించేటట్టు చేస్తూ లోనికి ఆహ్వానిస్తుంది. ప్రకృతి కవితలకు భావ పరిమళం కీలకం తారీఖులు కాదు , ఎందుకంటే ఇది తారిఖుల్ని పొందుపర్చిన క్యాలెండర్ కాదు.
భావాన్ని వ్యక్త పర్చే టప్పుడు , పదాలతొ బంతి ఆట ఆడే మెళుకువలు, నైపుణ్యం కీలకం, ఒక సస్పెన్స్ ,ఆత్రాన్ని సృష్టించాలి , అటువంటి మెళుకువలు కొరవడుతున్నాయి. ఉదా:
ఎప్పుడూ వచ్చే ఊర పిచ్చుక
రాలేదు
ఈరోజు
ఖాళీ కిటికీ,
గదిలో
ఒంటరై
నేను
గూడు పొదుగుతాను(ఖాళీ)
మనం చెప్పదలచుకున్న దాంట్లో ఏది ముఖ్యం అన్నది గ్రహించాలి పిచుక గదిలోకి రావట్లేదు, దానికి కిటికి అద్దం కావాలి, నీకు కిటికిలోనుండి దానిని చూసే చూపు , గది గూడు ఒకటే. ఇక్కడ ఒంటరిదైయ్యింది గది కాదు , గదిలోకి ఒంటరితనం వచ్చింది పిచుక బదులు. నువ్వు , కిటికి ఒంటరి గూడులైయ్యారు. ప్రకృతిలో ప్రతీకలు కోకొల్లలు ,వాట్ని నిశితంగా గ్రహించి కవిత గూడుని అల్లాలి. గూడు ని పొదగడం వుండదు,ఇది నై జమ్తా యార్, సంజా కర్. ఇదేదో ఇలానే రాయాలని కాదు ,నాకు బాగా తెల్సునని చెప్పటం లేదు. డిజిటల్ కెమెరా లోని వ్యూ ఫైండర్ ఒక డార్క్ రూమ్ లాంటిది, నీ విజువల్ ని ఎలా చూస్కుంటావో,అదే విధంగా కవిత లోని టోన్, టేక్ష్చర్, ఫార్మ్ ని రాస్తున్నప్పుడే ఫ్రేం చేస్కోవాలి. మన ఆలోచన చూపే మన వ్యూ ఫైండర్.
మరొక విషయం గమనించాలి మనం రాసే అంశాల వల్ల మనలో ఒక అలౌకైకిక శక్తి ప్రవేశించి కవిత్వ ఒత్తిడిని భాష పై సృష్టిస్తుంది అది విజయ్ లో వుంది. దానిని ఇంకా సాన బట్టి ఒక ఆయుధంగా మలుచుకోవాలి.
విజయ్ లో కొందరు హిందీ/ఉర్దూ కవుల్ని అనువాదించే నైపుణ్యం వుంది. ఇది కొనసాగించాలి, కాని గుర్తించాల్సినది, అనువాదం కంటే అనుసృజన చేయాలి, చేసేటప్పుడు భాషతో ఇమిడివున్న సంస్కృతిని పట్టుకోవాలి.
కవిసంగమం వేదిక ద్వారా నూతన ఒరవడి సృష్టిస్తున్న కవయత్రిలు/కవుల జాబితాలో మరొక్కరు చేరారు అన్న సంతోషం కలిగింది. ఇతను తన దంటూ ఒక బాటను ఏర్పర్చుకుంటున్నాడు. నాకు తోచిన మాటకు ముందొక మాట ఇది. ఇక మీరు ఆస్వాదించండి.ధాంక్యూ విజయ్. ఆల్ ది బెస్ట్..
జి.సత్య శ్రీనివాస్.
Reviews
There are no reviews yet.